గురూపదేశ మంత్రము

                                               గురూపదేశ మంత్రము.

( ప్రతిరోజు గురూపదేశ మంత్రమును 108లేక కనీసం 18 సార్లైనా మౌనంగా పఠించాలి.108 సార్లయితే శ్రేష్ఠం)

గురూపదేశ మంత్రమును ఇతరులకు వినబడకుండా , ఉపదేశము చేసిన గురువుకైనా సరే

వినబడకుండా జపించుకోవాలి. ఆ మంత్రము అందరికి తెలిసినదైనా  గురువు మనకు ఏమంత్రము ఉపదేశించాడో ఇతరులకు తెలియదు కదా , కనుక ఆ మంత్రమును అతి రహస్యంగా జపించుకోవాలి. గురూపదేశ మంత్రము ఒక్క అక్షరమైనా కావచ్చు, ఒక్క పదమైనా కావచ్చు, ఒక్క శ్లోకమైనా కావచ్చు, ఒక మంత్రమైనా కావచ్చు. లేక అందరికి తెలిసినదైనా కావచ్చు. లేక అంతకు ముందే మనకు తెలిసినదైనా కావచ్చు. ఏదైనా సరే వారు ( గురువుగారు) చెప్పిన దానిని భక్తి శ్రద్ధ విశ్వాసములతో త్రికరణ శుద్దిగా జపించుకొంటే మంత్రసిద్ది పొంది సత్పలితం కలుగుతుంది. అలా ఫలితం పొందిన తర్వాతకూడా ఎపుడు ( గురువుగారిపై, గురూపదేశ మంత్రముపై) విశ్వాసము కోల్పోతే అప్పుడే పతనమౌతారు . అందుకు దృష్ఠాంతరముగా ఓ కథ వివరిస్తాను.

                        ఒకానొకప్పుడు ఒక గురుకులు ఆశ్రమంలో ఒక గురువుగారుండే వారట. వారివద్ద జ్ణానార్ధు లైన శిష్యులు అనేకమంది వుండేవారట. అందులో ఇద్దరు శిష్యులు గురువుగారి యడల మిక్కిలి భక్తి , శ్రద్ధ, విశ్వాశములతో వినయముగా చాలాకాలము గురువు గారికి శిశ్రూషలు చేసారట. అందుకు మెచ్చిన గురువుగారు ఆ శిష్యులను చేరదీసి " బిడ్డలారా మీప్రవర్తన నాకెంతో సంతోషాన్ని కలిగించింది. మీరు నానుండి ఏవిద్య కావాలో కోరుకొనండి. మీకు నేర్పుతాను( ఉపదేశిస్తాను) అన్నారట. " గురువుగారి మాటలకు ఆ శిష్యులు అమితానందము పొంది, స్వామీ మాకు ఆకాశంలో విహరించాలని, మేము కోరుకున్న ప్రదేశమునకు సునాయాసముగా ఆకాశమార్గాన చేరుకోవాలని ఉంది. తమరు దయతో ఆవిద్యను ఉపదేశించండని ప్రార్ధించారు. సరేనని గురువుగారు వారిరువురికి విడివిడిగా రహస్యంగా చెరొక మంత్రాన్ని ఉపదేశించి , మీరు ఈ మంత్రాన్ని విశ్వాసముతో త్రికరణశుద్దిగా జపము చేసుకొనండి, మీ సాధనను బట్టి మీరు ఫలితాన్ని పొందుతారు. కాని మేము సిద్దిపొందామని , మేము గొప్పవారమని అహంకారాన్ని పొందకండి. మీకు శుభములు కలుగుగాక , అని దీవించి , ఇక మీరు ఈ గురుకులము నుండి మీమీ  ఇండ్లకు వెళ్లి గృహస్థ ధర్మాన్ని స్వీకరించి, ఆ ధర్మాన్ని నెరవేరుస్తూ  సుఖసంతోషాలతో జీవించండని దీవించి వారి వారి స్వస్థలాలకు పంపించాడు. ఆశిష్యులిరువు దూరదూరాన వేర్వేరు గ్రామాలలో వుండసాగారు. కొంతకాలము తర్వాత గురువుగారు కాలధర్మం చెందారట. ఆ విషయము తెలిసిన ఆ శిష్యులు గురువుగారిని తలచుకొని బాధపడి, మనసులోనే గురువుగారిని తలచుకొని , స్వామీ మీరుచెప్పిన ప్రకారమే మేము మంత్రసాధన చేస్తున్నాము. మమ్ములను అనుగ్రహించండని నమస్కరించు కున్నారు . మరి కొంతకాలము తర్వాత వారు మంత్రసిద్దిని ఆకాశగమనాన్ని పొందారట. వారికిమహదానందము కలిగినది. తోటివారు  వారిని గొప్పవారిగా గౌరవించ సాగారు. అప్పుడే మొదలైంది. మేము గొప్పవారమనే అహంకారము పొడసూప సాగింది. క్రమంగా వారు గురువుగారిని , గురువుగారు చెప్పిన మాటలను మర్చిపోయారు. చాలాకాలము తర్వాత వారిరువురు ఆకాశమార్గాన పయనిస్తూ ఒకరికొకరు తారసపడ్డారు( కలిసారు). ఒకరినొకరు కుశల ప్రశ్నలు వేసుకొని సంతోషముగా మాట్లాడుకుంటూ మాటల సందర్భంగా ఆ ఇద్దరిలో ఒకడు రెండవవానితో గురువుగారు నీకు ఏమంత్రాన్ని ఉపదేశించాడో చెపుతావా అన్నాడట . 
రెండవవాడు గురువుగారు నీకు చెప్పిన మంత్రాన్ని నాకుకూడా వినిపించాలి అని అన్నాడట. సరే అంటే సరే అనుకొని , మొదటివాడు నాకు గురువుగారు " ప " అనే  అక్షరాన్ని చెప్పారు అని అన్నాడట . రెండవ వాడు నాకు " క్షి " అనే అక్షరాన్ని చెప్పారు అని అన్నాడట .ఇంకేముంది వారిరువురు ' మనకు గురువు ,చెప్పింది , నాకు " ప " , నీకు " క్షి " అని చెప్పారు. రెండూ కలిపితే పక్షి ఔతుంది కదా , కాబట్టి మనము పక్షి పక్షి అంటూ జపించాము కాబట్టి మనము పక్షులవలె ఆకాశంలో విహరిస్తున్నాము. అని అనుకున్నారట . ఎప్పుడైతే గురువు గారిపై , గురువుగారి మాటపై , గురుమంత్రముపై విశ్వాసాన్ని కోల్పోయి ఇంతేకదా అనుకున్నారో, మరు క్షణమే వారి మంత్రసిద్ది  నశించి ఆకాశమునుండి భూపతనమై మరణించారట. గురువు గారిపై , గురువుగారి మాటపై , గురుమంత్రముపై విశ్వాసాన్ని కోల్పోతే  మంత్రసిద్ది నశించడమే కాకుండా మనకు ప్రమాదం కూడా కలుగవచ్చు. కనుక మనము గురువుగారిపై , గురూపదేశ మంత్రముపై విశ్వాసముతో భక్తిశ్రద్దలతో  జపించి, అనుష్ఠించి గురువుగారి అనుగ్రహమును , మంత్ర సిద్ధిని ( సత్ఫలితమును) పొందెదము  గాక . స్వామిశరణమ్.


                                                                   వోరుగంటి నాగభూషణం . గురుస్వామి.
                                                                                      గరిడేపల్లి

1 comment:

  1. అయ్యప్ప గురోపదేశం నియమ నిభందనలు తెలియజేయగల్గుతార

    ReplyDelete