అయ్యప్పకు అక్షర మాలిక







అమరాధిప నుత , అసుర సంహారక - ఆశ్రిత వత్సల అయ్యప్పా 
ఆదిదేవసుత , ఆపద్భాందవ - ఆనంద దాయక అయ్యప్పా            ॥ 1  ॥ 


ఇష్టదైవమా , ఇహపర దాయక - ఇడుముల బాపర అయ్యప్పా 
ఈశ్వర తనయా , ఈతిబాధలు - ఇపుడేతీర్చర అయ్యప్పా           ॥ 2. ॥ 


ఉభయ సంధ్యల , నిన్నే కొలిచెద - ఉడుతా భక్తితో అయ్యప్పా 
ఊహ కందని , ఊహాతీత - వేదాంత వేద్యా అయ్యప్పా.                 ॥ 3. ॥ 


ఋషి పూజిత హే , ఋగ్వేద రూపా - నక్షత్ర రూపా అయ్యప్పా 
ౠఢిగ నిన్ను , నమ్మిన వారికి - కొదవే  లేదుగ అయ్యప్పా.        ॥ 4  ॥ 


లుబ్దుడ నైతిని, యింత కాలము - నిను కొలువక నేనయ్యప్పా 
నా , తనువూ మనసూ ఊరడిల్లె నీ - పదముల చెంతనె అయ్యప్పా   ॥ 5. ॥


ఎరుమెలి వాసా , ఎరుకల వేషా - ఏమార్చకు  నను అయ్యప్పా 
ఏకాంత వాసా , ఏమని పొగడుదు - నీదు మహిమలు అయ్యప్పా     ॥ 6. ॥ 


ఐశ్వర్య  దాయక , విశ్వ మోహనా - మోహినిసుత వో అయ్యప్పా 
ఐక్యము చేయర  , నీలో నన్ను - శరణం శరణం అయ్యప్పా           ॥ 7. ॥ 


ఒరులను చూచి , ఓర్వని గుణమును - దూరము చేయర అయ్యప్పా 
ఓరిమి తోడను , సేవలు చేయగ - ఓర్పును నాకివు మయ్యప్పా.       ॥ 8. ॥ 


ఔరారా నీమహిమలు చూడగ - అచ్చెరువాయెర అయ్యప్పా 
ఔదల దాల్చుదు , నాదు గురువుల - మాటను ఎపుడు అయ్యప్పా     ॥ 9. ॥ 


అంబిక బాలా , అనాధ రక్షక - అఖిలము నీవే అయ్యప్పా 
ఆః ( హా) యని మేమచ్చెరు వొందగ - మహిమలు జూపర అయ్యప్పా  ॥ 10 ॥ 


కరిమల వాసా , కాంతి మలేశా - కరుణించుము మము అయ్యప్పా
ఖండితముగ నిను , నమ్మిన వారికి - కలుగును మోక్షము అయ్యప్పా. ॥ 11 ॥ 


గణపతి సోదర , గండర గండా - శరణం శరణం అయ్యప్పా 
ఘనమైనా నీ నామము తలచిన - తొలగును భయములు అయ్యప్పా.   ॥ 12 ॥ 


చంచలమైనా , నాదు మనసును - స్థిరముగ జేయర అయ్యప్పా 
ఛండాలునిలో , బ్రాహ్మణులోను - నీవే గదరా అయ్యప్పా                  ॥ 13 ॥ 


జగమునెల్ల బ్రోచెడి స్వామీ - జగన్నాధవో అయ్యప్పా 
జాలమేలరా నాపై కరుణను - కురిపించుటకు అయ్యప్పా                   ॥ 14 ॥ 


టక్కుటమారము చేయు వారికి - చిక్కవు గదరా అయ్యప్పా 
ఠణఠణ ఠణ ఠణ , వాద్యము మోగగ - సంతసింతువో అయ్యప్పా       ॥ 15 ॥ 

డంబముతో చరియించు వారికి - దక్కదు నీకృప అయ్యప్పా 
ఢమరుకమ్ము ధరియించిన శివుడు - నీదు జనకుడుగ అయ్యప్పా      ॥ 16 ॥ 


తల్లీ తండ్రీ , గురువూ దైవము - సర్వము నీవే అయ్యప్పా 
తప్పక ఎప్పుడు నిన్నే కొలుతుము - శరణం శరణం అయ్యప్పా.      ॥ 17 ॥ 


దండిగవున్న వారుధనముతో - నిను కొనలేరు అయ్యప్పా 
ధనధాన్యములను కోరనుస్వామీ - నీ దయ  కోరితి నయ్యప్పా          ॥ 18 ॥ 


పంబా బాలా , పాప విమోచన - పావన చరితా అయ్యప్పా 
ఫణి నీడలొ పవ, ళించిన స్వామీ - శరణం శరణం అయ్యప్పా           ॥ 19 ॥ 


బలాడ్యులైనా , నిన్ను బలముతో - గెలువగలేరు అయ్యప్పా 
భక్తితో నిన్ను, కొలిచెడి వారి - కోర్కెలు తీర్తువు అయ్యప్పా.              ॥ 20 ॥


మదనాంతక సుత , మోహిని పుత్రా - మోహము బాపర అయ్యప్పా 
యమ కుభేర , దిక్పాలక పూజిత - శరణం శరణం అయ్యప్పా        ॥ 21 ॥ 


రమా నాధ సుత , రమ్యగుణాకర - అలంకార ప్రియ అయ్యప్పా 
లఘువుగ నిన్ను , పూజించినను - సంతసింతువో అయ్యప్పా          ॥ 22 ॥ 


వశట్కారముల, కధిపతి నీవే -  శరణం శరణం అయ్యప్పా 
శంకర తనయా , షణ్ముఖ సోదర - మా శంకలు బాపర అయ్యప్పా   ॥ 23 ॥ 


షండుడైన, పాషండు డైన నీ - నామము తలచిన అయ్యప్పా 
సరగున వారిని , కరుణించేటి - కరుణా మయుడవు అయ్యప్పా.       ॥ 24 ॥ 


హరి హర పుత్రా , అయ్యప్ప స్వామీ - శరణం శరణం అయ్యప్పా 
హారతి గైకొని , ఆదరించారా  .. - శరణం శరణం అయ్యప్పా             ॥ 25 ॥ 


క్షణభంగురమౌ , తనువని తెలుసు - శాశ్వత మేదీ అయ్యప్పా 
క్షణక్షణమూ నిను, మరువక తలచెడి - శక్తి నొసంగుము  అయ్యప్పా.   ॥ 26 ॥ 


మా గురుదేవులు , మార్గదర్శకులు - మా  మంచివారగు అయ్యప్పా 
చంద్రమౌళి గురుస్వామిని బ్రోవర - దీవెన లిచ్చి అయ్యప్పా            ॥ 27 ॥ 


నీదు సేవలు , జేసెడు స్వాముల - నిజమగు భక్తుల నయ్యప్పా 
శంకరు , శరణం , నారసింహులను - కరుణతొ బ్రోవర అయ్యప్పా      ॥ 28 ॥ 


ఈ తీరుగ నిను , కొనియాడితి నే - నాగభూషణము నయ్యప్పా 
కృపా జలధి నీ కృపనూ నాపై - కురిపించుము నా అయ్యప్పా         ॥ 29 ॥ 


భక్తితోడ ఈ పాటను,పాడిన - విన్నవారికిని అయ్యప్పా 
సుఖసంతసమును ఆయురారోగ్య - సంపదలిచ్చును అయ్యప్పా         ॥ 30 ॥ 





No comments:

Post a Comment